మేఘమా దేహమా

Standard

ఈ పాట అర్థాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి తోడ్పడిన మిత్రులు ఫణీంద్ర గారికి, రంగా గారికి ముందుగా కృతఙ్ఞతలు.

ఓ మిత్రుడి సందేహం –
కవి మేఘాన్ని, దేహాన్ని మెరవకు అంటున్నాడు. మేఘాన్ని మెరవకు అనడం బాగానే ఉంది. దేహాన్ని కూడా మెరవకు అనటంలో కవి ఉద్దేశమేమిటి?
దానికి సమాధానం ఆలోచిస్తూ నే రాసుకున్న పూర్తి వ్యాఖ్య.

చిత్రం : మంచుపల్లకి (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీ వనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం

మెరుపులతో పాటు ఉరుములుగా..
దని రిస రిమ దని స దని ప గ
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా..
వేసవిలో మంచు పల్లకిగా..

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం

పెనుగాలికి పెళ్ళి చూపు..
పువ్వు రాలిన వేళా కల్యాణం..
అందాకా ఆరాటం .. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో … ఓ.. ఓ.. ఓ.. ఓ..

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం

పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. ఇది తెలిసిందే. తెలియనిదల్లా ఎపుడు అనేదే. మరణంలోని ఈ సందిగ్ధతే మనిషిని ఆశాజీవిని చేస్తుంది. ప్రతి మనిషి తాను నిండు నూరేళ్ళు జీవిస్తాననే ఆశాభావంతో బ్రతుకుతాడు. కానీ తన మరణం త్వరలోనే అని తెలిస్తే? అదీ యుక్తవయసులో ఐతే? ఆ మానసిక క్షోభ వర్ణనాతీతం.

చిత్రంలోని నాయిక పరిస్థితి ఇటువంటిదే. ఆమె శారీరక, మానసిక స్థితికి అద్దంపడుతుంది ఈ పాట. పైకి నవ్వుతూ బ్రతుకుతున్నట్లు నటిస్తున్నా లోలోన కబళించే ఆరొగ్య స్థితి. రేపనేది ఉందో లేదో తెలియని పరిస్థితి. ఐనా రేపటిపై ఆశ చావని మానసిక స్థితి. అంతలో ఆమె జీవితంలోకి అనుకోని అతిథి. ఆ అతిథి ప్రేమతో రేగిన మానసిక ఘర్షణ. మనసులో అతిథితో పాటు చేరిన చిరకాల జీవన ఆకాంక్ష. కానీ అది సాధ్యం కాదన్న మానసిక వేదన. ఈ సంఘర్షణకు అద్భుతమైన సాహిత్య రూపం ఈ రచన.

సుందర పల్లవి మూర్తి వేటూరి సుందర రామమూర్తి గారి రచన ఇది. పాటలో పల్లవి, మొదటి చరణం నిషయానికొస్తే రాసింది వేటూరి కాబట్టి భావ అన్వయంలో కొంత క్లిష్టత కనిపిస్తుంది. మిగతా రచయితలతో పోలిస్తే వేటూరి రచనలలో భావంలో ఘనీభవత, సరళత్వం, continuity తక్కువగా ఉంటుంది. పాటల్లో ఈ లక్షణాలను కోరుకునేవారికి వేటూరి రచనలు పెద్దగా రుచించవు. కానీ, రచనల్లో ఈ లక్షణాలతో వచ్చే చిన్న చిక్కేంటంటే చాలా సందర్భాల్లో కవి భావనే మన భావనగా తీసుకుని (అసం)తృప్తి పడాల్సి ఉంటుంది. వేటూరి రచనలలో భావం ఒక broader outline లో అకాశంలో నక్షత్రాలలాగ వెదజల్లబడి ఉంటుంది. ఆ outline పరిధికి లోబడి పాఠకుడు నక్షత్రాల భిన్న కూర్పుతో కవి చెప్పదల్చుకున్న భావాన్నే కాక తనకు తోచిన భిన్న భావరాశులెన్నో సృష్టించుకునే వెసులుబాటు వేటూరి రచనలలో హెచ్చుగా ఉంటుంది. ఏరుకునే వారికి ఏరుకున్నంత. కూర్చుకునే వారికి కూర్చుకున్నంత. అర్థం చేసుకునే వారికి చేసుకున్నంత.

పల్లవి రారాజు ఈ పాట పల్లవిలో కూడా తన రచనా వైదుషి కనబర్చాడు. దేహాన్ని, మేఘాన్ని అన్వయం చేస్తూ మేఘానికున్న లక్షణాలను దేహానికి ఆపాదించారు. మెరవటం, కురవటం మేఘం లక్షణాలు. దేహానివి కాదు. కానీ ఆ లక్షణాలను దేహానికి ఆపాదించడం ద్వారా కరిగే జీవనాన్ని, జీవనపు అనిత్యాన్ని వ్యక్తపరిచాడు. రెండే రెండు వాక్యాల్లో ఆమె మానసిక, శారీరక అవస్థను పూర్తిగా ఇమిడ్చారు.

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం

“జీవనం” అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి – బ్రతుకు, నీళ్ళు . పల్లవిలో ‘ బ్రతుకు ‘ అనే అర్థం దేహానికి వర్తిస్తే, ‘ నీళ్ళు ‘అనే అర్థం మేఘానికి వర్తిస్తుంది. “పల్లవి చివర్లో జీవనం అన్న పదాన్ని జీ-వనం అని విడదీసి పాడించారు రచయిత/స్వరకర్త. జీ అంటే ఆత్మ అని – వనం అంటే మేఘం అనీ అర్ధం! యమకాల్ని ప్రేమించే వేటూరి వారు తెలిసి చేసిన చిలిప్పని అయ్యుండొచ్చు” అని మిత్రులు రంగా గారి అభిప్రాయం.

“మెఱయు” అనే పదానికీ భిన్న అర్థాలున్నాయి – ప్రకాశించు, బయలుపడు, బయలువోవు. మేఘంనుండి జీవనం (నీరు) మెఱసిన దాని జీవనం కరుగుతుంది. దేహంనుండి జీవం మెఱసిన దాని జీవనం కరుగుతుంది.

అలాగే “క్షణం” పదానికి పండుగ, తిరునాళ్ళు అనే అర్థాలున్నాయి. నాయకుడి రాక ఆమె జీవితంలో ఓ పండుగ లాంటిది. తిరునాళ్ళలా ఆమె మనసులో ఎక్కడలేని సందడి. ఆ క్షణాన ఆమె మనసు ఉద్ధతిన ఎగసిపడి మెరుస్తోంది. ఆ క్షణాన మెరిసినా తన జీవనం త్వరలోనే కరిగేదని ఆమెకు తెలుసు. అందుకే మెరవకే ఈ క్షణం అని తన మనసుని ప్రాధేయపడుతోంది, నిభాయించుకుంటోంది.

మెరుపుని మిడిసిపాటుగా చూపిస్తూ దేహాన్ని మిడిసిపడవద్దని, ఎంత మిడిసిపడినా దాని జీవనం కరగుతుందని సూచిస్తున్నాడు. అది కురిసి కరిగే మేఘంలా నెమ్మదిగా కావచ్చు, లేదా మెరిసి మాయమయ్యే మెరుపులా క్షణికం కావచ్చు. తన బ్రతుకు మెరుపులా క్షణంలో కరిగేదని తెలిసినా, కురిసే మేఘంలా నెమ్మదిగా కరగాలనే ఆమె ఆరాటం.

మెరుపుని, కురవటాన్ని ఆమె బ్రతుకులో అలజడులుగా (మానసిక, శారీరక) చూపిస్తూ ఆ అలజడులతో కరిగే జీవనాన్ని సూచిస్తున్నాడు. కబళించే వ్యాధితో శారీరకమైన అలజడి, నాయకుడి ప్రేమతో మానసికమైన అలజడి.

కారుమబ్బులాంటి ఆమె దైహిక జీవితంలో అతను మెరుపులా ప్రవేశించాడు. మెరుపులా ఆమె జీవితంలో ఎంతో వెలుగు, ఆనందం నింపాడు. ఆమె మనసులో మేఘంలా ప్రేమను కురిపించాడు. అతని ప్రేమను పొందాలని, అతనితో కలసి నిండు నూరేళ్ళు నడవాలని ఆమె ఆరాటం. కానీ తన బ్రతుకులో ఆ వెలుగు, ఆనందం క్షణికమని తెలుసు. మెరుపులా కరిగే తన జీవనంలో అది సాధ్యం కాదనే నిరాశ.

కొద్దికాలం జీవించినా మెరుపులా నలుగురి జీవితాల్లో వెలుగునింపే నాయిక పాత్ర వ్యక్తిత్వ చిత్రీకరణ కూడా పల్లవిలో కనిపిస్తుంది. ఆమె వెలుగు పంచి మాయమయ్యే ఓ మెరుపు. ప్రేమను కురిసి కరిగే ఓ మేఘం. ఆ నలుగురిలో మెరుపులా ఆత్మస్థైర్యమనే వెలుగుని నింపింది. కురిసే మేఘంలా ఆశలు చివురింపచేసింది. జీవితాలను చక్కదిద్దింది.

మొదటి చరణాన్ని చూస్తే అందులోని వాక్యాలు భావంలో continuity లేక దేనికవే విడివడినట్లుగా ఉన్నాయి. ఒక వాక్యం దాని తరువాతి వాక్యంతో సంబంధం లేనట్టుగా అగుపిస్తాయి. రెండవ చరణంలో బాహ్యంగా కనిపించే continuity, అర్థ స్పష్టత ఇందులో లేదు. ఒక అమ్మాయి ఆశలు, ఆరాటాలు ఒక పక్క, తను త్వరలో చనిపోతుందన్న నిజం ఇంకో పక్క…. ఈ రెంటినీ చూపెట్టే ఉపమానాలు ఎంచుకున్నారు వేటూరి.

మెరుపులతో పాటు ఉరుములుగా..
దని రిస రిమ దని స దని ప గ
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా..
వేసవిలో మంచు పల్లకిగా..

పైకి చరణమంతా నాయిక నిరాశను ప్రతిబింబిస్తున్నట్లు కనిపించినా, చివరి మూడు వాక్యాల్లో ఆమె ఆశలు ఆరాటాలు అంతర్లీనంగా ఉన్నాయి. మొదటి మూడు వాక్యాల్లో నైరాశ్యం కొట్టుకొచ్చినట్టు కన్పిస్తే, చివరి మూడు వాక్యాల్లో ఆశనిరాశల దోబూచులాట కనిపిస్తుంది.

మెరుపులతో పాటు ఉరుములుగా : మెరుపు క్షణికమైన ఆశలకీ, ఉరుము గర్జిస్తూ తరిమే మరణానికీ సంకేతాలు. ఆమె జీవితంలో మెరుపులా క్షణంలో అంతమవుతున్న ఆశలతో పాటు ఉరుములా గర్జిస్తూ తరిమే మృత్యువు కూడా ఉంది.

మూగబోయే జీవస్వరములుగా : జీవ స్వరములు మూగబోవడం. ఇక్కడ జీవ స్వరములు ఆ అమ్మాయి తియ్యని పలుకులు … హీరో ని స్పందింపజేసిన మాటలు … అవి త్వరలో మూగబోతాయి అని చెప్పడం ఒక అర్థం.
జీవానికి హేతువులైన స్వరములు – ప్రాణహేతువులైన పంచ భూతాలు పంచ స్వరాలు , జీవికి ఆకారాన్నిచ్చే దేహం, ఆకారం లేని జీవాత్మ మిగిలిన రెండు స్వరాలు – మూగబోతాయి అని చెప్పడం రెండో అర్థం.
రెండింటిలోనూ త్వరలో మృత్యువు తప్పదనే పరమార్థం.

వేకువ ఝామున వెన్నెల మరకలుగా : వేకువైతే వెన్నెల కరిగిపోతుంది. ఆరిపోయే దీపం లాంటి ఆమె జీవితంలో, వేకువ ఝామున ఆఖరి వెన్నెల మరకలు ఉన్నాయన్న మాట. వేకువ ఝామున కరిగిపోయి అక్కడక్కడా మరకలుగా మిగిలిన వెన్నెల్లా తన బ్రతుకులో కొద్ది రోజులు మాత్రమే మిగిలాయన్న నిజం. అందమైన వెన్నెలను కూడా నల్లని కఱలుగా చూసే ఆమె మానసిక స్థితి.

ఉరుములా గర్జిస్తున్న మృత్యువు నీడలో మెరుపుల్లా క్షణంలో అంతమవుతున్న ఆశలు, త్వరలో మూగబోయే ఆమె తీయని పలుకులు, వేకువ ఝామున మరకలుగా మిగిలిన వెన్నెల్లా తన బ్రతుకులో కొద్ది రోజులు మాత్రమే మిగిలాయన్న ఆలోచన, ఆమెకు తీవ్రనిరాశను మిగులుస్తున్నాయి

రేపటి వాకిట ముగ్గులుగా :
నిరాశ : ఉందో లేదో తెలియని రేపు ఒక భ్రాంతి. అలాంటి రేపటి వాకిట ముగ్గులు (ఆశలు) మిథ్య అనే నిరాశ.
ఆశ : రేపు ఎంతో తియ్యనిది. ఆ తియ్యని రేపటి కోసం కనే తియ్యని కలలు. అవి ముగ్గుల్లా అందంగా మెరుస్తూ ఉంటాయి, కాని నిజమవుతాయో లేదో తెలియదు కానీ నిజమవ్వాలనే ఆశాభావం. తన భవిష్యత్తు (రేపు) ముగ్గుల్లా అందంగా ఉండాలనే ఆశ.

స్మృతిలో మిగిలే నవ్వులుగా :
నిరాశ : జ్ఞాపకాల్లోని నవ్వులు. తను త్వరలో జ్ఞాపకంగా మారిపోతాననే నైరాశ్యం.
ఆశ : స్మృతిలో మిగిలే జ్ఞాపకాలు, నవ్వులు. అద్భుతమైనవి, ఆహ్లాదకరమైనవి, కలకాలం ఉండేవి. అంతే అద్భుతంగా, ఆహ్లాదకరంగా తనూ కలకాలం ఉండాలనే కోరిక.

వేసవిలో మంచు పల్లకిగా :
నిరాశ : ఇక్కడ పల్లకి ఆశల పల్లకి, పెళ్ళి పల్లకి. అమ్మాయి ఊహల పల్లకి కట్టుకుంటొంది.ఐతే ఇది మంచు పల్లకి. పైగా వేసవి. త్వరగా కరిగిపోక తప్పదు.
ఆశ : మండు వేసవిలాంటి ఆమె జీవితంలో అతనో మంచు పల్లకిలా వచ్చి ఊరటనిచ్చాడు. ఆ మంచు పల్లకి ఆసరాతో మండువేసవిని అధిగమించాలనే ఆరాటం. ఆ మంచు పల్లకి తన పెళ్ళి పల్లకి అవ్వాలనే ఆశాభావం.

పెనుగాలికి పెళ్ళి చూపు..
పువ్వు రాలిన వేళా కల్యాణం..
అందాకా ఆరాటం .. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో … ఓ.. ఓ.. ఓ.. ఓ..

పెనుగాలి లాంటి మృత్యువుతో పువ్వులాంటి తనకి పెళ్ళిచూపులు. పెనుగాలి ధాటికి అల్లల్లాడే పువ్వు రాలిన క్షణాన పెళ్ళి. అంతవరకూ పెనుగాలి ధాటిని ఎదురొడ్డి కొమ్మను అంటుకు శాశ్వతంగా ఉండాలనే ఆరాటం. రాలిన పువ్వులా కాక తన దేవుడి అర్చనకు మిగిలే పువ్వు అవ్వాలని ఆశ. అలాంటి ఆశలతో పేరంటం. పేరంటం అనడం ఆమె మనసులో పెళ్ళి చేసుకొని ముత్తైదువగా మిగలాలనే ఆశను సూచిస్తుంది. నువ్వు నాకొక పూమాల తేవాలి …అది పెళ్ళి మాలా లేక మరణించాక తన దేహం పై ఉంచే మాలా? చితికి అడుగు దూరంలో ఉన్నా చావని ఆశ … ఆ పూమాల తన పెళ్ళిమాలగా మిగులుతుందేమో అని …

5 responses »

  1. santharam…I was reading this while listening to the song…felt heavy-hearted, unconsciously my eyes became wet…while reading the last stanza. I can say its a good start in the beginning of new year..”repati vaakita mugguluga”…”naakoka poomaala tevaali nuvvu..”..anytime I listen to these two..I become calm…I want to see an in-depth write-up on “Chinukulanni kalise chitra kaaveri…chivarikaa kaaveri kadali deveri..” (from shubhasankalpam)..

  2. Pingback: మేఘమా దేహమా (శాంతారాం మడక) – వేటూరి

Leave a comment